Telugu Rekha Media - తెలంగాణ / పెద్దపల్లి/మంథని : ప్రభుత్వం రుణమాఫీ చేసిన అర్హులైన రైతులందరికీ వాటి ఫలాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని,రైతుల రుణాల రెన్యువల్ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ముత్తారం మండలంలో విస్తృతంగా పర్యటించారు. ముత్తారం మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, తహసిల్దార్ కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు. ముత్తారం మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సందర్శించిన కలెక్టర్, ప్రభుత్వం రుణమాఫీ చేసిన రైతుల రుణాల రెన్యువల్ ప్రక్రియను పరిశీలించారు. రుణమాఫీ రికార్డులను తనిఖీ చేసిన కలెక్టర్ రుణమాఫీ జరిగిన రైతులందరి రుణాలు త్వరితగతిన రెన్యూవల్ చేయాలని, రుణ మాఫీ ఫలాలు సంబంధిత రైతులకు అందేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు.ముత్తారం మండల తహసిల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ క్షేత్రస్థాయి ధ్రువీకరణ ద్వారా పెండింగ్ ధరణి దరఖాస్తులను పరిష్కరించాలని సూచించారు. తహసిల్దార్ కార్యాలయంలో కలెక్టర్ ప్రజల నుంచి వివిధ సమస్యల పై దరఖాస్తులను స్వీకరించారు. ప్రజలు అందించిన దరఖాస్తులను సంబంధిత శాఖలకు కేటాయించి , వాటి పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. ముత్తారం మండలంలోని ఎంపీడీవో కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ గ్రామాలలో చేపట్టాల్సిన పారిశుధ్య చర్యలు, పంచాయతీ కార్యదర్శి విధులు తదితర అంశాల పై సూచనలు జారీ చేశారు.ముత్తారం మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా ప్రసవాలను నిర్వహించాలని, ప్రస్తుత నెల ప్రసవం జరిగే మహిళలను మ్యాపింగ్ చేసుకోని ఫాలో అప్ చేయాలని, ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం జరిగేలా చూడాలని కలెక్టర్ సూచించారు. వర్షాకాలం నేపథ్యంలో పీ.హెచ్.సీ ద్వారా అవసరమైన జాగ్రత్తలు పాటించాలని, అవసరమైన మందుల స్టాక్ అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు. ఈ తనీఖీలలో జిల్లా కలెక్టర్ వెంట డివిజనల్ పంచాయతీ అధికారి కే సతీష్, ముత్తారం తహసిల్దార్ సుమన్, సింగల్ విండో చైర్మన్ యాదగిరి రావు, డిప్యూటీ డిఎం&హెచ్ఓ డాక్టర్ రవి సింగ్, ముత్తారం ఎంపీడీవో జి.లలిత, మండల పంచాయతీ అధికారి బి.వేణుమాధవ్, పంచాయతీరాజ్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ ఎం. వరలక్ష్మి, వ్యవసాయ అధికారి శ్రీకాంత్, ప్యాక్స్ సీఈఓ ప్రసాద్, వైద్యాధికారి డాక్టర్ అమరేందర్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Reporter
Telugu Rekha Media