Telugu Rekha Media - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : తల్లి పాలు ప్రపంచ తల్లిపాల వారోత్సవాల పోస్టర్ ను ఆవిష్కరించి మాట్లాడుతూ తల్లి పాలివ్వడం వల్ల తల్లులకు మరియు శిశువులకు అనేక ప్రయోజనాలు ఉన్నాయని, తల్లి పాల వల్ల శిశువులకు సరైన పోషకాహారం, రోగనిరోధక శక్తిని పెరుగుతుందని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. బుధవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ సచివాలయంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పోస్టర్లను జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ గారు జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ మరియు నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి నారపు రెడ్డి మౌర్య తదితర వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచ తల్లి పాల వారోత్సవాలను (WBW ) మొట్టమొదట 1992లో తల్లిపాలను ప్రోత్సహించడానికి మరియు తల్లి పాల యొక్క ఆవశ్యకత ను గురించి అవగాహన పెంచడానికి జరుపుకోవడం జరిగిందనీ, అప్పటి నుండి ప్రతి ఏట వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ (WBW)ను ఆగస్టు 1 నుండి 7 వరకు జరుపుకుంటున్నామని తెలిపారు. తల్లి పాలివ్వడం వల్ల తల్లులకు మరియు శిశువులకు అనేక ప్రయోజనాలు ఉన్నాయని, తల్లి పాల వల్ల శిశువులకు సరైన పోషకాహారం, రోగనిరోధక శక్తిని పెరుగుతుందని తెలిపారు. తల్లి పాలివ్వడం వల్ల కలుగు ప్రయోజనాలను పలు మాధ్యమాలు ద్వారా ప్రచారం నిర్వహించి అవగాహన కల్పించాలని అన్నారు. బిడ్డ పుట్టిన మొదటి ఆరు నెలలు తల్లి పాల ఆవశ్యకతను ప్రతి ఒక్కరికి తెలిసేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని వైద్యాధికారులకు కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. శ్రీహరి, శ్రీనివాసరావు, జిల్లా ఇమ్యునైజేశన్ అధికారిణి శాంత కుమారి తదితర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Reporter
Telugu Rekha Media