Telugu Rekha Media - ప్రాంతీయ వార్తలు / హైదరాబాద్ : రిజర్వేషన్లపై ఉత్కంఠ బలమైన అభ్యర్థులను బరిలో దింపేందుకు పార్టీల వ్యూహాలు స్థానికసంస్థల ఎన్నికల సందడి మొదలైంది. ఎప్పుడు నోటిఫికేషన్ విడుదల అయినా పోటీలో ఉండేలా ఆశావాహులు సన్నద్దమవుతున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల కసరత్తులో భాగంగా వార్డులు, పంచాయతీల వారీగా ఓటరు జాబితా ఇప్పటికే విడుదల కావడంతో ఒక్కసారిగా పల్లెల్లో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఓటరు జాబితా పట్టుకుని ఆశావాహ నేతలు సామాజికవర్గాల వారీగా లెక్కలు వేసుకుంటున్నారు. రిజర్వేషన్లు ఖరారు అయిన తరువాత అందుకు అనుగుణంగా ఆయా పంచాయతీలు, వార్డులనుంచి అభ్యర్థులను బరిలో దింపేందుకు ప్రధానరాజకీయ పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. అదే విధంగా ఏ సమయంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసినా సమర్థవంతంగా నిర్వహించేందుకు అఽధికారయంత్రాంగం సైతం సిద్ధ మవుతున్నట్లు అధికారులు తెలుపుతున్నారు. రిజర్వేషన్లపై ఉత్కంఠ. పంచాయతీ ఎన్నికలతోపాటు స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికలను ప్రభుత్వం సంక్రాంతి పండుగ లోపు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఇటీవల మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించారు. దీంతో పాటు ప్రభుత్వం కులగణన సర్వే చేపడుతోంది. ఈ సర్వే ఆధారంగా బీసీ రిజర్వేషన్లు నిర్ణయించనుంది. ఈ ప్రక్రియ పూర్తికాగానే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లు చేపట్టనున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. దీంతో పంచాయతీ రిజర్వేషన్లు ఎలా ఉండబోతున్నాయి అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రజల్లోకి ఆశావాహులు: త్వరలో గ్రామపంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం ఉండడంతో సర్పంచ్‌గా పోటీ చేయాలనుకునే ఆశావాహులు ప్రజల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం ఆశావహులు ప్రజల్లోనే ఉంటూ గ్రామాల్లో చిన్నాచితక శుభ, అశుభ కార్యక్రమాలకు హాజరవుతూ ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా తాము పోటీల్లో ఉంటామనే సంకేతాలు ఇస్తున్నారు. కొన్నిచోట్ల ప్రజల్లో పేరున్న తాజామాజీలు మళ్లీ ప్రజల మధ్యే ఉంటుండగా మరికొన్ని చోట్ల అధికారపార్టీకి చెందిన నాయకులు ప్రభుత్వం తమదేని తాము ఉంటేనే పనులు అవుతాయని ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్కోగ్రామంలో నలుగురైదుగురు ప్రయత్నాలు చేస్తున్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో రెండు పర్యాయాలు జరిగిన ఎన్నికల్లో అదే పార్టీకి చెందిన సర్పంచ్ లే 90శాతం నెగ్గారు. ప్రస్తుతం కాంగ్రెస్‌పార్టీ అధికారంలో ఉండడంతో ఈ సారి తమను ఆదరిస్తారని కాంగ్రెస్ శ్రేణులు ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి.
Admin
Telugu Rekha Media